Saturday, December 14, 2013

భారత దేశ పురాతన సాంకేతిక విజ్ఞానం


భారత దేశ పురాణాలలో చెప్పిన సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు మనకి ఉన్న టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు గొప్పది. కానీ మనలో చాలామందిమి నమ్మం. అదేమిటంటే అవి సైంటిఫిక్ గా నిరూపించబడలేదు అంటారు. అసలు నిజాన్ని మాత్రం మరిచి పోతున్నారు. అదేమిటంటే అవి నిరూపితమైన తరువాతే గ్రంధాలు గా రాసారు.

ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు. అదే వెయ్యేళ్ళు వెనక్కి వెళితే అప్పుడు ఉంది కేవలం ముప్పై కోట్లు మాత్రమే. ఈ వెయ్యేళ్ళలో ఇంతమంది పెరిగారు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవుడు ఉన్నాడు అని ఇంత టెక్నాలజీ కనుక్కున్న శాస్త్రజ్ఞులే చెబుతున్నారు. అంటే మనకి తెలిసింది కేవలం చివరి వెయ్యేళ్ళు మాత్రమే. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పుడు ఉన్నది కేవలం ఒక సునామీ వస్తే కొట్టుకు పోయే టెక్నాలజీ మాత్రమే. అప్పట్లో ఏమి టెక్నాలజీ ఉందో తెలీదు. ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు. కొన్ని ఎలా ఏర్పడ్డాయో తెలీదు. కొన్ని కట్టడాలు ఎలా కట్టారో తెలీదు. ఇక్కడ దేవుడు అనే భావన తీసి ప్రక్కన పెడితే ఒకప్పటి మన భారతదేశ సాంకేతిక విజ్ఞానాన్ని అందరూ సందేహిస్తున్నారు. మాయలు, మంత్రాలు అంటే ఏమిటో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అనే పేరుతో వస్తున్న మాయలు మంత్రాలు గమనించండి.

వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి కిలోమీటర్లు వెళ్ళటానికి ఎంత సమయం పడుతూ ఉండేది. కనీసం ఇరవై నుండి యాభై రోజులు. కానీ ఇప్పుడు ఇరవై నుండి యాభై నిముషాలు అంతే. ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత ఇరవై నుండి యాభై సెకండ్లు పట్టవచ్చు. ఇంటర్నెట్, వైర్ లెస్ టెక్నాలజీ తో మనం కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇన్విసిబిల్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఒక కోట్ వేసుకుంటే మనల్ని కనపడనీయకుండా చేసేటట్లు. మనం మాటలతో పనులు జరిగేటట్లుగా మనకి ఫోన్లు, కంప్యూటర్ లు, రోబోట్ లు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశంలో ఏమి జరుగుతున్నా చూపించటానికి శాటిలైట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి చేస్తున్నారో చూపించటానికి కెమెరాలు ఉన్నాయి.
ఇవే కదా మనం అనుకునే మాయలు మంత్రాలు. మాట్లాడితే ఏదో ప్రత్యక్షమవటం, ఏది కావాలంటే అది మంత్రాలతో సృష్టించటం, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడటం.... ఇలా మనం అనుకునే మాయలు మంత్రాలకి మనం దగ్గర అవుతున్నాం. అలా దగ్గరవుతూ కూడా మన పురాణాలలో చెప్పిన దాన్ని మనం నమ్మం.

లోపం ఎక్కడ ఉందో తెలుసా? మనలో కాదు. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ లో. నిజం గా నిజం. బారతదేశ పురాతణ సాంకేతిక విజ్ఞానాన్ని పరీక్షించ గలిగే శక్తి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ కి లేదు. గ్రహాలు, వాటి మధ్య దూరాలు మన పురాణాల్లో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్తే, ఇప్పుడు నాసా వాళ్ళు అది నిజమే అని చెబుతున్నారు. మనకున్న శక్తిని ఎవరో చెప్తే కానీ నమ్మలేని దౌర్భాగ్యం మనది. పుట్టుక దగ్గరనుండి చనిపోయే వరకే కాకుండా చనిపోయిన తర్వాత ఏమీ జరుగుతుంది అనేది కేవలం మన పురాణాలలో మాత్రమే ఉంది. ఎక్కడ ఏమి జరుగుతుంది అనే ప్రతి ప్రశ్నకీ సమాధానం మన పురాణాలలో దొరుకుతుంది. మరి మనం ఎప్పుడు నమ్ముదాం....

కానీ మనకున్న అంత సాంకేతిక విజ్ఞానం ఎలా కనుమరుగు అయ్యింది? ఇదే అందరూ అడిగే ప్రశ్న. కొన్ని కొన్నింటికి ఊహలు ఉండాలి తప్పదు. అలాంటిందే ఈ క్రింది నా ఊహ. మనకి ఉన్న సాంకేతిక విజ్ఞానం కనుమరుగు అయిపోవటానికి కారణాలు ఈ క్రిందివి అయి ఉండవచ్చు
1) ప్రకృతి వైపరీత్యాలు
2) రాజ్య వ్యవస్థ
3) యుద్దాలు
4) కొందరి స్వార్ధం
5) వలసలు

నా దృష్టిలో భూమి అత్యంత ప్రమాదకరమైన నివసించటానికి వీలు కలిగిన ఒక గ్రహం. ఎందుకంటే మూడు వంతులు నీరే ఉంది. ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యం చాలు ఉన్నవాళ్ళందరూ తుడిచిపెట్టుకు పోవటానికి. అలా జరిగి అప్పట్లో మనకి ఉన్న టెక్నాలజీ మొత్తం నాశనం అయ్యి ఉండవచ్చు.

మన రాజుల వ్యవస్థలో ఒకరి మీదకి ఒకరు దండయాత్ర చెయ్యటం అనేది చాలా మాములుగా జరిగే విషయం. అటువంటి పరిస్థితుల్లో శత్రువుల కి దొరకకుండా ఉండేందుకు అప్పటి వరకు ఆ రాజ్యం లో కనిపెట్టిన టెక్నాలజీ ని మొత్తం నాశనం చెయ్యటం చాలా సాధారణం గా జరిగే విషయం.

యుద్దాలు వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి కూడా టెక్నాలజీ నాశనం అయ్యి ఉండవచ్చు
పూర్వ కాలం టెక్నాలజీ ఒకడి సొత్తు గా మాత్రమే ఉండేది. ఉదాహరణకి వైద్యుడు కేవలం వాడి వారసులకు మాత్రమే వైద్యం నేర్పే వాడు. కనిపెట్టిన టెక్నాలజీ ని ఇంకొకరితో పంచుకోకపోవటం వల్ల అంతం అయ్యి ఉండవచ్చు. మన ఆయుర్వేదం కూడా అలాగే మరుగున పడిపోయింది. ఇంకో మతం వారు పరిపాలించటం వల్ల కూడా ఆయుర్వేదం మరుగున పడిపోయింది.


చివరిగా నేను అనుకునేది వలసలు. ఇంతకంటే ఆవాసయోగ్యమైన గ్రహం ఇంకొకటి కనిపించి ఉండవచ్చు. భూమికి ఏదో ప్రమాదం జరగవచ్చని ముందుగానే తెలుసుకుని అక్కడకి వెళ్లి పోయి ఉండవచ్చు. కేవలం కొంతమంది మూర్ఖులు మాత్రమే ఇక్కడ ఉండి తరువాత రోజుల్లో మానవ అభివృద్ధి జరిగి ఉండవచ్చు. మళ్ళి మొదటినుండి అన్ని కనిపెట్టాల్సి వచ్చింది.

Sunday, October 28, 2012

దేవుడు ఎవరు?


ఈ ప్రశ్న నాది కాదు. అందరిది. నిజం గా దేవుడు ఉంటే మరి మనిషికే ఎందుకు పరిమితమయ్యాడు. జంతువులకి దేవుడు ఉండడా? దేవుడుని చూసిన వాళ్లెవరు లేరా? ఉంటే వాళ్లెవరు దేవుడిని ఇంకొకరికి చూపించలేరా?

ఒక మనిషి లేకుండా ఇంకొకరు పుట్టరు. ఇది అందరికి తెలిసిన నిజం. మనకు తెలిసిన దేవుళ్ళలో ముఖ్యులు త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మన పురాణాలు చూస్తే వీరి చిన్నతనం గురించి కానీ ఇప్పుడు ఎలా ఉన్నారన్నది కానీ ఎవరికీ తెలీదు. ఎందుకు తెలుసుకోలేక పోయారు. తెలుసుకున్నంత వరకైనా ఎలా తెలుసుకోగలిగారు. శివుడి భార్యలు పార్వతి మరియు గంగ. కొడుకులు కుమార స్వామి, వినాయకుడు. మరి మనవళ్ళు? ఎవరూ లేరా? ఉండీ తెలియలేదా?

విష్ణువుకి, బ్రహ్మకి కొడుకులు లేరా? వారు దేవుళ్ళు కారా? ఇలా ఆలోచించుకుంటే మనకి ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారో అర్ధం అవుతుంది.

నా దృష్టిలో ఈ సృష్టి కాల క్రమేనా ఏర్పడింది. దేవుళ్ళు కూడా అంతే. కాకుంటే దైవత్వం కొందరికే వచ్చింది. ఎలాగంటారా మన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందరికి తెలుసు. కానీ అతని కొడుకు ఎంతమందికి తెలుసు. చాలా కొద్ది మందికి. ఒక వంద సంవత్సరాల తర్వాత అతను ఎంతమందికి తెలిసి ఉంటాడు. అంతా మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడంటే అంతా డాక్యుమెంట్ చేసి ఉంచుతున్నాం కాబట్టి మళ్ళి కనుక్కోవచ్చు. అంతే ఎవరైతే గొప్ప దైవత్వం కలవారో వాళ్ళే గుర్తుండిపోయారు.

తరాలు మారినప్పుడు పురాణాలూ మారాయి. ఒకప్పుడు క్రీస్తు, అల్లా లేరు. కానీ ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు. అలానే రెండు వందల సంవత్సరాల క్రితం సాయిబాబా లేడు. కానీ ఇప్పుడు ....

ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది దేవుళ్ళు లేరు. ఎవరికైనా ఉంది మహిమలు మాత్రమే. ఆ మహిమలు కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ. ఇప్పుడు ఈ క్షణం నా దగ్గర కూడా కొన్ని మహిమలు ఉంటే నన్ను కూడా దేవుడిగా చూస్తారు. నేను కూడా వర్షాన్ని కురిపించగలిగితే, క్షణాల్లో రోగాన్ని తగ్గించగలిగితే కనీసం దేవుని ప్రతినిధిగా చూస్తారు. ఇది సహజం. దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడే. వైద్యం లాగా దైవత్వం కూడా ఒక కళ. అది ప్రకృతి దగ్గర నేర్చుకోవాలి. ముందు మానవ శరీరం గురించి తెలుసు కోవాలి. శరీరం లోని ప్రతి అణువు పనిని నియంత్రించడం నేర్చుకోవాలి. తరువాత ప్రకృతి ని నియంత్రించడం నేర్చుకోవాలి. ఇవన్ని నేర్చుకున్నవాడి అధీనంలో ప్రపంచం ఉంటుంది. వారికి చావు ఉండదు. ఇవన్ని నేర్చుకోవటానికి ఎంతో మంది మన సమాజానికి దూరం గా వెళ్లి తపస్సు చేస్తున్నారు. కొంతమంది అలా నేర్చుకుని ప్రకృతిలో కలిసి పోతే ఇంకొంతమంది 
నేర్చుకోలేక బయటకి వచ్చి బాబాలుగా స్థిరపడి పోయారు.

మనిషి గురించి మొత్తం తెలుసుకున్నపుడే మనిషి దేవుడు అవుతాడు.

Friday, July 20, 2012

నువ్వు కూడా దేవుడు అవ్వొచ్చు...ఎలా?


రాముడు ని మనం దేవుడి లాగా కొలుస్తున్నాం. ఆయన పుట్టేటప్పుడు దేవుడు కాదు. అడవికి వెళ్ళేటప్పుడు దేవుడు కాదు. రావణున్ని చంపినపుడు దేవుడు కాదు. మరెవరు? రాజ్యానికి రాజు. మన పురాణాల్లో తనని రాజుగానే రాసారు. మరి దేవుడు ఎలా అయ్యాడు??

గౌతమ బుద్ధుడు. పుట్టినప్పుడు హిందువు. కాని తన సూత్రాలతో ఒక కొత్త మతాన్నే సృష్టించి హిందూమతానికే సమానంగా నిలిపాడు. (తరువాతి రోజుల్లో ఆదిశంకరాచార్యుడు హిందూమత ధర్మాన్ని పునరుద్ధరించాడు). అటువంటి గౌతమ బుద్ధుడు ఏనాడు తనని దేవునిగా చెప్పుకోలేదు. తనకి ఉన్నది శిష్యులు మాత్రమే. కాని ఇప్పుడు ఆయన స్థానం ఏమిటో అందరికి తెలుసు.

ఏసుక్రీస్తు మనిషి. ప్రజలందరి ముందు తనని శిలువ వేసారు. తనని రక్షించుకోలేని వాడు ప్రపంచాన్ని ఎలారక్షిస్తాడు అని ఎవరూ ఆలోచించలేదు. అతను జనం కోసం శిలువకు సిద్ధపడ్డాడు. దాని వల్ల అతను దేవుడయ్యాడు.

ఇలా చూస్తే మహమ్మద్, సాయిబాబా... వీళ్ళందరూ పుట్టేటప్పుడు కానీ చనిపోయేటప్పుడు కానీ దేవుళ్ళు కాదు. కేవలం మనుషులకు మంచి దారి చూపటం వల్ల, సేవ చేయటం వల్ల ఆ తరువాతి కాలంలో దేవుడిగా చూస్తున్నారు.

ఒకే ఒక్కరికి సాయం చేసి దేవుడివైపో

ఎలాగంటారా.... ఈ చిన్న లెక్కను చూద్దాం

నువ్వు నీకు అప్పటి వరకు కనీసం పరిచయం లేని ఒకరికి సాయం చేసావు. అదీ ఎటువంటి సాయం అంటే తన నీ ప్రాణాలని పణంగా పెట్టి తన కుటుంబాన్ని మొత్తం కాపాడినటువంటి సాయం. నువ్వు వారినుండి ఏమి ఆశించకుండా ఎప్పుడైనా కష్టమొచ్చినపుడు మళ్ళి దగ్గరకు రావటానికి సంకోచించ వద్దు అని చెప్పి వెళ్ళావ్. వాళ్ళు ఆ రోజు నుండి నీ ఫోటో ఒకటి పెట్టుకుని పూజించటం మొదలుపెట్టారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.

మనమడు అడుగుతాడు. తాతా ఎవరూ ఆ ఫోటోలో ఉంది. ఆయన మన కుటుంబాన్ని కాపాడాడు అంటాడు తాత. అంటే దేవుడే కదా తాతా. అవును మనవడా... కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.

ఆ మనమడు ఇప్పుడు తాత. అక్కడి నుండి నువ్వు వాళ్ళకి దేవుడివి. కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందరూ పూజించటం మొదలు పెడతారు. మనవాళ్ళకి కొత్తగా వచ్చిన దేవుళ్లంటే చాలా భక్తి. ఆ కుటుంబం లో అందరికి అదృష్టం బాగుండి అన్ని కలిసి వస్తుంటే మిగతావాళ్ళు ఆరా తీయటం మొదలు పెడతారు. వాళ్ళు ఫలానా దేవుడిని పూజిస్తున్నారు అందుకే వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి అని తెలుస్తుంది. అంతే ఇక అతి త్వరలో నీ గుళ్ళు వూరంతా, రాష్ట్రమంతా, దేశమంతా వెలుస్తాయి.

ఇదంతా నువ్వు ఏ స్వార్థం లేకుండా ఒకరికి సాయం చేసినపుడు మాత్రమే. అదే నువ్వు ఎంత ఎక్కువ మందికి ఏ స్వార్థం లేకుండా సాయం చేస్తావో అంత తొందరగా దేవుడివౌతావు.

Saturday, July 14, 2012

మనుషుల్లో దేవుడు


మనుషుల్లో దేవుడు

ఎప్పుడైనా గమనించారా మనం అప్పుడప్పుడు కొందరిని దేవుడితో పోలుస్తుంటాం. అదీ ఎవరైనా మనల్ని కాపాడినప్పుడు. రోడ్డుపై నడుస్తూ ఉన్నారు. వెనకాలే ఒక కారు వస్తుంది. మీరు చూసుకోలేదు. ఒకతను మిమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కకి నెట్టాడు. అప్పుడు మీ చుట్టుప్రక్కన వాళ్ళు ఇలా అంటారు. అతనెవరో దేవుడిలా వచాడు అని. అదే ఒక కుక్క మీకు అడ్డం వచ్చి పక్కకి తీసుకువెళ్ళి ప్రమాదాన్ని తప్పిస్తే అప్పుడు అంతా ఆ కుక్కని దేవుడు పంపించారు అంటారు కాని కుక్కే దేవుడు అనరు.

అంటే మనకి తెలియకుండా మనం చెప్పే నిజం ఏమిటంటే మనిషే దేవుడు. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడేవాడు దేవుడు తో సమానం. ప్రతిమనిషిలో దేవుడున్నాడు. కొంతమందిలో అవసరానికి దేవుడు బయటకి వస్తాడు. కొంత మందిలో అలవాటుగా బయటకు వస్తాడు.

మీరొకచోట సిగెరెట్ కలుస్తున్నారు. అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి ధర్మం చెయ్యమన్నాడు. మీరు చేసారు. ఇంకొకడు వచ్చి అడిగాడు. వాడికి ఇచ్చారు. మళ్ళి ఇంకొకడు వచ్చాడు. మీరు ఇవ్వటం మానుకుంటారు. ప్రతి మనిషి తన జీవితంలో బిచ్చగాడి దగ్గర అబద్దం చెప్పి ఉంటాడు. చిల్లర లేదు అని. ఏం చిల్లరే ఇవ్వాలా నోటు ఇవ్వకూడదా. మనిషిలో దేవుడు బయటకు రావాలంటే ఎదుటి వాడి కష్టం అర్ధమవ్వాలి, నమ్మగలగాలి.

నేను చెన్నై లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు శివ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి. పేరు పల్లవి అనుకుంటాను. వాళ్ళిద్దరూ ఒకసారి ఊరికి బయలుదేరారు పినాకిని ట్రైన్ లో. అతనిది చీరాల. ఆ అమ్మాయిది విజయవాడ అనుకుంటాను. ఆ అమ్మాయి వస్తూ వస్తూ ఒక కవర్ నిండా చిల్లర వేసుకును వచ్చింది. ఎందుకు అంటే ,ముష్టి వాళ్ళకి దానం చేయటానికి అంది. ఉంటేనే సరిగ్గా ఇవ్వరు. అటువంటిది ఇవ్వటానికి విడిగా పెట్టుకును వచ్చింది. అటువంటి వాళ్ళని మనం ఎగతాళి చేస్తామే తప్ప అభినందించం. ఇది ఆ అమ్మాయికి పుట్టుకతో వచ్చిన అలవాటేమో. ఇటువంటి వాళ్ళలో మనం ఎప్పుడూ దేవుడిని చూడొచ్చు.

ఇంకొకడు వుండేవాడు. వెంకి అని. ఫ్రెండ్స్ కి చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఉండేవాడు. మేమంతా అతను పిసినారి అనుకునే వాళ్ళం. కాని అతను తన అవసరం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడు. ఇంకొకడి దగ్గర చెయ్యి చాచడు. అటువంటి వాడు పిసినారి కాదు. కాకుంటే కొంతమంది అలా అర్ధం చేసుకుంటారు. వాళ్లది రాజమండ్రి. ఒకసారి నేను తనతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ అమ్మ పేపర్ లో ఎవరికో ఆరోగ్యం బాగాలేదుహెల్ప్ చెయ్యండి అని రాసుంటే అడ్రస్ తీసుకుని పంపుతున్నారు. కొంతమందిలో పలనా వాళ్ళకి సహాయం చేశాను అని అందరూ చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కొంతమందిలో ఎవరికీ తెలియక పోయిన పర్వాలేదు నేను హెల్ప్ చెయ్యాలి అన్న మనసు ఉంటుంది అని. ఇటువంటి వంటి వారి వల్లే దేవుడు కనిపించడు అనే పేరొచ్చిందేమో.


మనిషే దేవుడు అని పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే మనిషి మనిషినుండే పుడతాడు. మరో మనిషిని చంపుతాడు. చావుకు దగ్గరైన వాళ్ళని బ్రతికిస్తాడు. మరోమనిషి స్తితిగతులను మారుస్తాడు. ఇలా మన దృష్టిలో దేవుడు చేయగలడు అనుకున్నవి అన్ని ప్రపంచంలో ఎవరో ఒక మనిషి చెయ్యగలరు. చెయ్యలేనిది ఒక్కటే. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం. అది దేవుడి వల్ల కూడా కాదు కదా. అంటే దానర్థం మనిషే దేవుడు. దేవుడే మనిషి. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే స్వార్ధం లేకుండా వేరొకరికి సాయం చేసే మనిషే దేవుడు.

Sunday, June 24, 2012

మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ


రెండవది: మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ

కొంచెం మా ఊరి గురించి చెప్తాను. మా ఊరు మద్దులూరు. పల్లెటూరు. మొత్తం ఆరు గుళ్ళు (ఇప్పుడు ఏడు), ఒక చెరువు, ఏరు, పక్కనే జామయిలు చెట్లు, తాటితోపు, హైస్కూల్,పక్కనే చింత తోపు, ఒక వీధి బడి, ఒక బిల్డింగ్ ఉన్న బడి, మట్టిరోడ్డు ... ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మన దేశానికీ మా ఊరికి పోలిక కనిపిస్తుంది. మా ఊరికి కూడా మూడు ప్రక్కలా ఏరు పారుతుంటుంది మన దేశానికీ సముద్రాలు ఉన్నట్లు. కాకుంటే ఒక ప్రక్క హిమాలయాలు లేవు. అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంది.

విగ్రహం పొలంలో బయటపడితే ఆ స్థలంలో గుడి కట్టించారు బ్రహ్మసాని కుటుంబీకులు. నా చిన్నప్పుడు ఆ గుడి ఒక పూరిగుడిసె. పేరు గుర్తులేదు కాని ఒక ఆమె అక్కడ ఏర్పాట్లు అన్ని చూస్తుండేది. అంటే శుభ్రం చెయ్యటం లాంటివి. హనుమజ్జయంతి రోజు మాత్రం అక్కడ తిరునాళ్ళ జరిగేది.

ఉదయం నుండి రాత్రి పొద్దు పోయేంత వరకు జరుగుతుంది తిరునాళ్ళ. ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకుని గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వచ్చిన ఐసులు, బొమ్మలు, తినుబండారాలు కొనివ్వమని అమ్మవాళ్ళని ఏడిపించి మనం ఏడ్చి ఇంటికొస్తాం. సాయంత్రం అయ్యేసరికి ప్రభలు కట్టుకుని మళ్ళి గుడికి బయలుదేరుతాం. ఆ ప్రభలు మీద దేవుడు బొమ్మలుంటాయా అంటే అదికాదు. తెలుగు దేశం పార్టి వాళ్ళందరూ ఎన్టీఆర్, కాంగ్రెస్ వాళ్ళందరూ కృష్ణ బొమ్మలు వేసుకుని వస్తారు. కొంతమంది దేవుడి బొమ్మలు వేసుకొస్తారు. రాత్రికి డాన్స్ పార్టి ఛండాలంగా. తెలుసుగా మీకు అప్పట్లో డాన్స్ రికార్డింగ్ డాన్సులు ఎలా ఉండేవో. కాని జనాలు అంతా ఎగబడి చూస్తారు. దాన్ని జాగారం అంటారు.

అప్పుడు నాకు అనిపిస్తుంది. ఏం రోజూ వీళ్ళకి భక్తి ఉండదా? ఈ రోజే కొత్తగా వచ్చిందా? అని. 

ఈరోజు ఒక రాజకీయనాయకుడి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఒక మతం వాళ్ళు వాళ్ళకి ఉన్న దేవుడి/దేవుళ్ళ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఒక పార్టి వాళ్ళు వాళ్ళ నాయకుడి పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దేవుడికి నాయకుడికి తేడా కనిపించటం లేదు. మీకు తేడా కనిపిస్తుందా?

అంటే దేవుడు కూడా ఒక వర్గానికి నాయకుడు లాంటి వాడా??? 


కాదు కానీ అలా చూడటానికి అలవాటు పడిపోయాం.

నాకు గుర్తున్న చిన్నప్పటి దేవుడు


నాకు గుర్తున్న చిన్నప్పటి దేవుడు (పుట్టింది 1984, ఒక పదేళ్లు చిన్నతనం అనుకుందాం)

మొదటి ఐదేళ్లు ఏమి గుర్తులేదు. ఎవరికీ గుర్తుండదు అనుకుంటాను. ఎవరెవరు ముద్దులు పెట్టారు, ఎవరెవరు ఎత్తుకున్నారు, ఎవరిమీద చుచ్చు పోసామో ఏదీ గుర్తుండదు. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరదాగా చెప్పుకుంటే తప్ప మనకి తెలీదు. కాని మనం ఎప్పుడైతే బడిలో చేరుతామో అప్పటినుండి అన్నీ గుర్తుంటాయి. దానివల్ల నాకు తెలిసిదేమిటంటే కష్టాలు మొదలైన తర్వాత గుర్తుపెట్టుకోవటం మొదలుపెడతాం అని.

అలా గుర్తున్న వాటిల్లో మొదటిది: నా చిన్నప్పుడు అమ్మానాన్నలతో తిరుపతి వెళ్ళాను. అక్కడ నాకు దర్శనం చేసుకున్నది గుర్తులేదు. వరుసలో నిలబడింది గుర్తులేదు. ఆకరికి తిరుపతి లడ్డు కూడా గుర్తులేదు. గుర్తుంది ఒక్కటే రంగులరాట్నం. మొదటిసారిగా చూసాను. మొత్తం లైట్లు వేసి రంగులు తిరుగుతువుంటే చూడముచ్చటేసింది. విచిత్రం ఏమిటంటే ఎక్కాలి అనిపించలేదు. ఎందుకనేది నాకు తెలీదు. తర్వాత రైలు ఎక్కి ఒంగోలు వచ్చాం. వచ్చే దారిలో ట్రైన్ ఏదో ప్రాబ్లం వస్తే. వేరే నారాయణాద్రి ఎక్కటమో దిగటమో చేసాం. అలా ట్రైన్ మారేటప్పుడు మా నాన్న నన్ను ఎత్తుకు వెళ్ళాడు నేను నిద్ర లేవకపోయేసరికి. ఆ టైం లో ఒంగోలు నుండి మా ఊరికి బస్సులేదు. లారి దొరికితే దానిలో వెళ్ళాం.

ఇక్కడ నాకు దేవుడు ఎవరో తెలీదు. దేవుడిని చూసింది గుర్తు లేదు. మీరు ఇప్పటివరకు తిరుపతి వెళ్లుంటే ఒక్కసారి గర్భగుడి లో దేవుడు విగ్రహం ఎలాఉంటుందో గుర్తుకు తెచ్చుకోండి. మీకు గుర్తుకువస్తే మీరు దేవుడిని మనసుతో చూసినట్టు. లేదంటే భక్తితో చూసినట్టు. భక్తితో చూస్తే మీకు అక్కడి విగ్రహాన్ని చూసినప్పుడు ఏ భావన అయితే ఉందో అదే భావన ఎక్కడ గుళ్ళో విగ్రహాన్ని చూసినా వస్తుంది.

దేవుడు ఉన్నాడా?


నాకు చిన్నప్పటినుండి ఎప్పుడూ ఎవరూ దేవుడి గురించి చెప్పలేదు. అందుకనే నాకు దేవుడు అంటే ఏ భావన లేదు. నేను దేవుడి గురించి ఆలోచించేవాన్నే కాదు. ఏదో అమ్మ చెప్పింది. దణ్ణం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిది. అంతకుమించి ఏమి తెలీదు. విచిత్రమేమిటంటే నేను ఎప్పుడూ ఈ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరు అని అడగలేదు. నాకు తెలిసింది ఒక్కటే. దేవుళ్ళ వల్ల పండగలు వచ్చాయి. పండగల వల్ల శెలవులు వచ్చాయి. కాబట్టి నేను దేవుడు ఉన్నాను అని నమ్మటం మొదలు పెట్టాను.

ఇది చదివే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. మీరు దేవుడు ఉన్నాడు అని ఎప్పటినుండి నమ్మటం మొదలు పెట్టారు. అసలు దేవుడు అంటే ఎవరు అని ఎప్పుడు తెలిసింది? నా వరకు నేను బడికి వెళ్లటం మొదలు పెట్టిన తర్వాతే దేవుడు ఉన్నాడు అని నమ్మటం మొదలు పెట్టాను అనుకుంటుంటాను.