Sunday, June 24, 2012

మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ


రెండవది: మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ

కొంచెం మా ఊరి గురించి చెప్తాను. మా ఊరు మద్దులూరు. పల్లెటూరు. మొత్తం ఆరు గుళ్ళు (ఇప్పుడు ఏడు), ఒక చెరువు, ఏరు, పక్కనే జామయిలు చెట్లు, తాటితోపు, హైస్కూల్,పక్కనే చింత తోపు, ఒక వీధి బడి, ఒక బిల్డింగ్ ఉన్న బడి, మట్టిరోడ్డు ... ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మన దేశానికీ మా ఊరికి పోలిక కనిపిస్తుంది. మా ఊరికి కూడా మూడు ప్రక్కలా ఏరు పారుతుంటుంది మన దేశానికీ సముద్రాలు ఉన్నట్లు. కాకుంటే ఒక ప్రక్క హిమాలయాలు లేవు. అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంది.

విగ్రహం పొలంలో బయటపడితే ఆ స్థలంలో గుడి కట్టించారు బ్రహ్మసాని కుటుంబీకులు. నా చిన్నప్పుడు ఆ గుడి ఒక పూరిగుడిసె. పేరు గుర్తులేదు కాని ఒక ఆమె అక్కడ ఏర్పాట్లు అన్ని చూస్తుండేది. అంటే శుభ్రం చెయ్యటం లాంటివి. హనుమజ్జయంతి రోజు మాత్రం అక్కడ తిరునాళ్ళ జరిగేది.

ఉదయం నుండి రాత్రి పొద్దు పోయేంత వరకు జరుగుతుంది తిరునాళ్ళ. ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకుని గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వచ్చిన ఐసులు, బొమ్మలు, తినుబండారాలు కొనివ్వమని అమ్మవాళ్ళని ఏడిపించి మనం ఏడ్చి ఇంటికొస్తాం. సాయంత్రం అయ్యేసరికి ప్రభలు కట్టుకుని మళ్ళి గుడికి బయలుదేరుతాం. ఆ ప్రభలు మీద దేవుడు బొమ్మలుంటాయా అంటే అదికాదు. తెలుగు దేశం పార్టి వాళ్ళందరూ ఎన్టీఆర్, కాంగ్రెస్ వాళ్ళందరూ కృష్ణ బొమ్మలు వేసుకుని వస్తారు. కొంతమంది దేవుడి బొమ్మలు వేసుకొస్తారు. రాత్రికి డాన్స్ పార్టి ఛండాలంగా. తెలుసుగా మీకు అప్పట్లో డాన్స్ రికార్డింగ్ డాన్సులు ఎలా ఉండేవో. కాని జనాలు అంతా ఎగబడి చూస్తారు. దాన్ని జాగారం అంటారు.

అప్పుడు నాకు అనిపిస్తుంది. ఏం రోజూ వీళ్ళకి భక్తి ఉండదా? ఈ రోజే కొత్తగా వచ్చిందా? అని. 

ఈరోజు ఒక రాజకీయనాయకుడి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఒక మతం వాళ్ళు వాళ్ళకి ఉన్న దేవుడి/దేవుళ్ళ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఒక పార్టి వాళ్ళు వాళ్ళ నాయకుడి పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దేవుడికి నాయకుడికి తేడా కనిపించటం లేదు. మీకు తేడా కనిపిస్తుందా?

అంటే దేవుడు కూడా ఒక వర్గానికి నాయకుడు లాంటి వాడా??? 


కాదు కానీ అలా చూడటానికి అలవాటు పడిపోయాం.

No comments:

Post a Comment

మనిషి దేవుడిని చేశాడా దేవుడు మనిషిని చేశాడా...