Friday, July 20, 2012

నువ్వు కూడా దేవుడు అవ్వొచ్చు...ఎలా?


రాముడు ని మనం దేవుడి లాగా కొలుస్తున్నాం. ఆయన పుట్టేటప్పుడు దేవుడు కాదు. అడవికి వెళ్ళేటప్పుడు దేవుడు కాదు. రావణున్ని చంపినపుడు దేవుడు కాదు. మరెవరు? రాజ్యానికి రాజు. మన పురాణాల్లో తనని రాజుగానే రాసారు. మరి దేవుడు ఎలా అయ్యాడు??

గౌతమ బుద్ధుడు. పుట్టినప్పుడు హిందువు. కాని తన సూత్రాలతో ఒక కొత్త మతాన్నే సృష్టించి హిందూమతానికే సమానంగా నిలిపాడు. (తరువాతి రోజుల్లో ఆదిశంకరాచార్యుడు హిందూమత ధర్మాన్ని పునరుద్ధరించాడు). అటువంటి గౌతమ బుద్ధుడు ఏనాడు తనని దేవునిగా చెప్పుకోలేదు. తనకి ఉన్నది శిష్యులు మాత్రమే. కాని ఇప్పుడు ఆయన స్థానం ఏమిటో అందరికి తెలుసు.

ఏసుక్రీస్తు మనిషి. ప్రజలందరి ముందు తనని శిలువ వేసారు. తనని రక్షించుకోలేని వాడు ప్రపంచాన్ని ఎలారక్షిస్తాడు అని ఎవరూ ఆలోచించలేదు. అతను జనం కోసం శిలువకు సిద్ధపడ్డాడు. దాని వల్ల అతను దేవుడయ్యాడు.

ఇలా చూస్తే మహమ్మద్, సాయిబాబా... వీళ్ళందరూ పుట్టేటప్పుడు కానీ చనిపోయేటప్పుడు కానీ దేవుళ్ళు కాదు. కేవలం మనుషులకు మంచి దారి చూపటం వల్ల, సేవ చేయటం వల్ల ఆ తరువాతి కాలంలో దేవుడిగా చూస్తున్నారు.

ఒకే ఒక్కరికి సాయం చేసి దేవుడివైపో

ఎలాగంటారా.... ఈ చిన్న లెక్కను చూద్దాం

నువ్వు నీకు అప్పటి వరకు కనీసం పరిచయం లేని ఒకరికి సాయం చేసావు. అదీ ఎటువంటి సాయం అంటే తన నీ ప్రాణాలని పణంగా పెట్టి తన కుటుంబాన్ని మొత్తం కాపాడినటువంటి సాయం. నువ్వు వారినుండి ఏమి ఆశించకుండా ఎప్పుడైనా కష్టమొచ్చినపుడు మళ్ళి దగ్గరకు రావటానికి సంకోచించ వద్దు అని చెప్పి వెళ్ళావ్. వాళ్ళు ఆ రోజు నుండి నీ ఫోటో ఒకటి పెట్టుకుని పూజించటం మొదలుపెట్టారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.

మనమడు అడుగుతాడు. తాతా ఎవరూ ఆ ఫోటోలో ఉంది. ఆయన మన కుటుంబాన్ని కాపాడాడు అంటాడు తాత. అంటే దేవుడే కదా తాతా. అవును మనవడా... కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.

ఆ మనమడు ఇప్పుడు తాత. అక్కడి నుండి నువ్వు వాళ్ళకి దేవుడివి. కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందరూ పూజించటం మొదలు పెడతారు. మనవాళ్ళకి కొత్తగా వచ్చిన దేవుళ్లంటే చాలా భక్తి. ఆ కుటుంబం లో అందరికి అదృష్టం బాగుండి అన్ని కలిసి వస్తుంటే మిగతావాళ్ళు ఆరా తీయటం మొదలు పెడతారు. వాళ్ళు ఫలానా దేవుడిని పూజిస్తున్నారు అందుకే వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి అని తెలుస్తుంది. అంతే ఇక అతి త్వరలో నీ గుళ్ళు వూరంతా, రాష్ట్రమంతా, దేశమంతా వెలుస్తాయి.

ఇదంతా నువ్వు ఏ స్వార్థం లేకుండా ఒకరికి సాయం చేసినపుడు మాత్రమే. అదే నువ్వు ఎంత ఎక్కువ మందికి ఏ స్వార్థం లేకుండా సాయం చేస్తావో అంత తొందరగా దేవుడివౌతావు.

Saturday, July 14, 2012

మనుషుల్లో దేవుడు


మనుషుల్లో దేవుడు

ఎప్పుడైనా గమనించారా మనం అప్పుడప్పుడు కొందరిని దేవుడితో పోలుస్తుంటాం. అదీ ఎవరైనా మనల్ని కాపాడినప్పుడు. రోడ్డుపై నడుస్తూ ఉన్నారు. వెనకాలే ఒక కారు వస్తుంది. మీరు చూసుకోలేదు. ఒకతను మిమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కకి నెట్టాడు. అప్పుడు మీ చుట్టుప్రక్కన వాళ్ళు ఇలా అంటారు. అతనెవరో దేవుడిలా వచాడు అని. అదే ఒక కుక్క మీకు అడ్డం వచ్చి పక్కకి తీసుకువెళ్ళి ప్రమాదాన్ని తప్పిస్తే అప్పుడు అంతా ఆ కుక్కని దేవుడు పంపించారు అంటారు కాని కుక్కే దేవుడు అనరు.

అంటే మనకి తెలియకుండా మనం చెప్పే నిజం ఏమిటంటే మనిషే దేవుడు. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడేవాడు దేవుడు తో సమానం. ప్రతిమనిషిలో దేవుడున్నాడు. కొంతమందిలో అవసరానికి దేవుడు బయటకి వస్తాడు. కొంత మందిలో అలవాటుగా బయటకు వస్తాడు.

మీరొకచోట సిగెరెట్ కలుస్తున్నారు. అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి ధర్మం చెయ్యమన్నాడు. మీరు చేసారు. ఇంకొకడు వచ్చి అడిగాడు. వాడికి ఇచ్చారు. మళ్ళి ఇంకొకడు వచ్చాడు. మీరు ఇవ్వటం మానుకుంటారు. ప్రతి మనిషి తన జీవితంలో బిచ్చగాడి దగ్గర అబద్దం చెప్పి ఉంటాడు. చిల్లర లేదు అని. ఏం చిల్లరే ఇవ్వాలా నోటు ఇవ్వకూడదా. మనిషిలో దేవుడు బయటకు రావాలంటే ఎదుటి వాడి కష్టం అర్ధమవ్వాలి, నమ్మగలగాలి.

నేను చెన్నై లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు శివ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి. పేరు పల్లవి అనుకుంటాను. వాళ్ళిద్దరూ ఒకసారి ఊరికి బయలుదేరారు పినాకిని ట్రైన్ లో. అతనిది చీరాల. ఆ అమ్మాయిది విజయవాడ అనుకుంటాను. ఆ అమ్మాయి వస్తూ వస్తూ ఒక కవర్ నిండా చిల్లర వేసుకును వచ్చింది. ఎందుకు అంటే ,ముష్టి వాళ్ళకి దానం చేయటానికి అంది. ఉంటేనే సరిగ్గా ఇవ్వరు. అటువంటిది ఇవ్వటానికి విడిగా పెట్టుకును వచ్చింది. అటువంటి వాళ్ళని మనం ఎగతాళి చేస్తామే తప్ప అభినందించం. ఇది ఆ అమ్మాయికి పుట్టుకతో వచ్చిన అలవాటేమో. ఇటువంటి వాళ్ళలో మనం ఎప్పుడూ దేవుడిని చూడొచ్చు.

ఇంకొకడు వుండేవాడు. వెంకి అని. ఫ్రెండ్స్ కి చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఉండేవాడు. మేమంతా అతను పిసినారి అనుకునే వాళ్ళం. కాని అతను తన అవసరం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడు. ఇంకొకడి దగ్గర చెయ్యి చాచడు. అటువంటి వాడు పిసినారి కాదు. కాకుంటే కొంతమంది అలా అర్ధం చేసుకుంటారు. వాళ్లది రాజమండ్రి. ఒకసారి నేను తనతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ అమ్మ పేపర్ లో ఎవరికో ఆరోగ్యం బాగాలేదుహెల్ప్ చెయ్యండి అని రాసుంటే అడ్రస్ తీసుకుని పంపుతున్నారు. కొంతమందిలో పలనా వాళ్ళకి సహాయం చేశాను అని అందరూ చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కొంతమందిలో ఎవరికీ తెలియక పోయిన పర్వాలేదు నేను హెల్ప్ చెయ్యాలి అన్న మనసు ఉంటుంది అని. ఇటువంటి వంటి వారి వల్లే దేవుడు కనిపించడు అనే పేరొచ్చిందేమో.


మనిషే దేవుడు అని పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే మనిషి మనిషినుండే పుడతాడు. మరో మనిషిని చంపుతాడు. చావుకు దగ్గరైన వాళ్ళని బ్రతికిస్తాడు. మరోమనిషి స్తితిగతులను మారుస్తాడు. ఇలా మన దృష్టిలో దేవుడు చేయగలడు అనుకున్నవి అన్ని ప్రపంచంలో ఎవరో ఒక మనిషి చెయ్యగలరు. చెయ్యలేనిది ఒక్కటే. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం. అది దేవుడి వల్ల కూడా కాదు కదా. అంటే దానర్థం మనిషే దేవుడు. దేవుడే మనిషి. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే స్వార్ధం లేకుండా వేరొకరికి సాయం చేసే మనిషే దేవుడు.